సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో గిగ్ వర్కర్లు భేటీ అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఫుడ్ డెలివరీ (Food Delivery) కంపెనీలు స్విగ్గి, జొమాటో రైడర్లు, ఆటో డ్రైవర్లు, గిగ్ ఫ్లాట్ ఫారమ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గి, జొమాటో ఇతర కంపెనీల్లో పని చేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వారు తీసుకు వచ్చారు. ముఖ్యంగా మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని సీఎంకు వర్కర్లు వివరించారు. ఆర్థికంగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 20 వేల గిగ్ వర్కర్లు ఉన్నామని, తమకు ఉద్యోగ భద్రతా కల్పించాలని సీఎంను కోరినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
ఈ పథకం ద్వారా తాము ఉపాధిని కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్, ర్యాపిడోతో పలు సంస్థలు సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని వారు ఆందోళనలు చేపట్టారు. బస్ భవన్ ముట్టడించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ఆయా సంస్థల సిబ్బంది ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం తాజాగా వారితో సమావేశం అయ్యారు.