ధరణి (Dharani) పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రులు నిషేధిత జాబితా, అసైన్ భూములు, పట్టా భూములతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో వాటన్నింటిపై పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ధరణి పోర్టల్ లో లొసుగులు ఉన్నాయని గతంలో పలు మార్లు రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాలన చేస్తామని ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ధరణిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సుమారు 2 గంటల పాటు అధికారులతో ధరణికి సంబంధించి ఆయన పలు అంశాలపై చర్చించారు. ధరణి యాప్ భధ్రతపై సమావేశంలో సీఎం ఆరా తీశారు.
ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ధరణిలో లోటుపాట్లపై నివేదిక ఇవ్వాలని ఈ సందర్బంగా నవీన్ మిట్టల్ ను సీఎం ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సీఎం సూచించారు. ఇది ఇలా వుంటే ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని సీఎం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆ సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ధరణి లావాదేవీలపై విమర్శలు వస్తున్నాయని, వాటన్నింటిపై వివరణ ఇవ్వాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూములు సర్వే, డిజిటలైజేషన్ చేయాలని, ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం రూ.83 కోట్లు నిధులు ఇచ్చిందని, ఆ నిధులన్నీ ఏమయ్యాయని అధికారులను సీఎం నిలదీశారు. త్వరలోనే ధరణిపై మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.