Telugu News » Kaleswaram : కాళేశ్వరం అవినీతి.. ఏం జరగబోతోంది..?

Kaleswaram : కాళేశ్వరం అవినీతి.. ఏం జరగబోతోంది..?

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వివాదాస్పదం కాగా.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సర్కార్ పరువు పోయింది. అయినా.. ఆ పార్టీ నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. భారీ ప్రాజెక్టుల్లో ఇలాంటివి సహజమేనని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

by admin
cm-revanth-reddy-sensational-decision-on-kaleshwaram-project

– కాళేశ్వరంపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్
– అధికారులతో మంత్రి వరుస భేటీలు
– త్వరలో మేడిగడ్డ సందర్శన
– ఎల్ అండ్ టీ లేఖతో ముదురుతున్న వివాదం
– సిట్టింగ్ జడ్జితో విచారణ మొదలయ్యేది ఎప్పుడు?
– ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలకు నీళ్లు పారాయి?
– కరెంట్ బిల్ ఎంత కట్టారు?
– మేడిగడ్డ కుంగడానికి కారణాలేంటి? ఎవరు బాధ్యులు?
– కాళేశ్వరం వలన ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా?
– ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది?
– మున్ముందు ఖర్చు చేయాలా? లేక, మూసేయాలా?
– మేధావులు ఏమంటున్నారు..?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. రీడిజైన్ పేరుతో బ్యారేజీలు, రిజర్వాయర్లను నిర్మించింది. అయితే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారనే విమర్శలను ఎదుర్కొంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయంపై కాంగ్రెస్ (Congress) బాగా ఫోకస్ చేసి విమర్శల దాడి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ దే అధికారం. దీంతో కాళేశ్వరం అవినీతి లెక్కలన్నీ బయటపడతాయని అంతా అనుకుంటున్నారు. దీనికి తగ్గట్టే రేవంత్ (Revanth) సర్కార్ కూడా అడుగులు వేస్తోంది. అసలు, ఈ ప్రాజెక్ట్ ఏంటి..? డిజైన్ల మార్పు, అంచనాల పెంపు.. ఇలా అన్ని విషయాలను క్షుణ్ణంగా అధికారుల నుంచి ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

cm-revanth-reddy-sensational-decision-on-kaleshwaram-project

సిట్టింగ్ జడ్జితో విచారణ

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తామని తెలిపారు. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామన్నారు. కాళేశ్వరం పాజెక్టు మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని.. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్నదెవరు? ఇలా అన్నీ విచారణలో బయటకు వస్తాయన్నారు. రేవంత్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరంతో మాజీ సీఎం కుటుంబం, కాంట్రాక్ట్ సంస్థలు లాభపడ్డాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.

ఏం చేస్తారో చేసుకోండి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కాళేశ్వరం విషయంలో మాటలకే పరిమితం అయింది. ఎన్నికల ప్రచారంలో ఏటీఎంలా వాడేశారని ఢిల్లీ పెద్దలు విమర్శల వరకే ఆగిపోయారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే.. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. రేవంత్ సర్కార్ ఇప్పుడు కాళేశ్వరం లెక్కలు బయటకు తీస్తుండడం, విమర్శలు చేస్తుండడంతో బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారని అందరూ అనుకుంటుంటే.. అలాంటిదేం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉందిగా ఏం చేస్తారో చేసుకోండి అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళ్తోంది.

కూపీ లాగుతున్న మంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వివాదాస్పదం కాగా.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సర్కార్ పరువు పోయింది. అయినా.. ఆ పార్టీ నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. భారీ ప్రాజెక్టుల్లో ఇలాంటివి సహజమేనని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేళేశ్వరం ఖర్చులు, ప్లానులు ఇతర అంశాల గురించి కూపీ లాగుతున్నారు. తాజాగా ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. త్వరలో ఉత్తమ్ మేడిగడ్డలో పర్యటించనున్నారు.

ఎల్ అండ్ టీ రివర్స్

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ఇప్పటిదాకా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడలేదు. చిన్న టెక్నికల్ ప్రాబ్లం.. మనకేం నష్టం లేదు.. ఎల్ అండ్‌ టీ దే బాధ్యత.. వాళ్లే కట్టిస్తారు అంటూ అప్పట్లో కేటీఆర్ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఎల్ అండ్ టీ తమకేం సంబంధం లేదని అంటోంది. ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెబుతోంది. మొదట్లో తమదే బాధ్యత అని ఎందుకు చెప్పింది..? అప్పటి ప్రభుత్వ పెద్దలు సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి అలా చెప్పించారా? ఇప్పుడు అధికార మార్పిడి జరగడంతో ఎల్ అండ్ టీ రివర్స్ అయ్యిందా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

మేధావుల డిమాండ్

కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయి నీటి పారుదల రంగాల నిపుణులు, ఆర్థిక, సామాజిక నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీని వేయాలనే డిమాండ్ మేధావుల సైడ్ నుంచి వినిపిస్తోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు? ఎన్ని ఎకరాలకు నీళ్లు పారాయి? ఎంత కరెంట్ బిల్ కట్టారు? మేడిగడ్డ కుంగడానికి కారణాలేంటి? ఎవరు బాధ్యులు? అసలు ఈ ప్రాజెక్ట్ వలన ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? ముందు ముందు పెట్టే పెట్టుబడి పెట్టాలా? లేక, ప్రాజెక్ట్ ఇక్కడి తోటే మూసేయాలా? అనే విషయాలు తేల్చాలని అంటున్నారు మేధావులు. మౌలిక సదుపాయాలపై నైపుణ్యం ఉన్న ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ను సంప్రదించి పై విషయాలను విచారించి రిపోర్ట్ తీసుకున్నాక ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రూపాయి ఖర్చుకు పావలా ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి పెద్ద భారంగా మారుతుందని చెబుతున్నారు.

You may also like

Leave a Comment