అయోధ్య (Ayodhya) రామయ్యకు దేశ, విదేశాల నుంచి భక్తులు కానుకలు పంపిస్తున్నారు. తాజాగా శ్రీ రాముని కోసం మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రత్యేకంగా వస్త్రాలను నేసి పంపారు. ఈ వస్త్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అందజేశారు.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ వస్త్రాలను నేశారు. ఈ వస్త్రాల కోసం ‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే)’అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 10 నుంచి 22 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో పుణెతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు కూడా పాల్గొన్నారు. మొత్తం 12 లక్షల మంది భక్తులు పాల్గొని ప్రత్యేక వస్త్రాలను నేశారు. ట్రస్టు సెక్రటరీ, వ్యవస్థాపకులు అనఘా గైసిస్ మాట్లాడుతూ…. గతేడాది డిసెంబర్ 10 నుంచి 22 వరకు దో ధాగే శ్రీరామ్‌కే లియే పేరిట కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు.
తమ షోరూం, వర్క్ షాపులో తొమ్మిది హ్యాండ్ లూమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందులో 80,000 మంది సామాన్య ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ఈ వస్త్రాల తయారీకి స్వచ్ఛమైన పట్టు దారాలను వాడామని పేర్కొన్నారు. మొత్తం 12 లక్షల మంది చేనేత మగ్గాలపై రెండు దారాలు కట్టాల్సి వచ్చిందని వివరించారు. ఈ మహా కార్యక్రమానికి బ్రాహ్మణుల నుంచి దళితుల వరకు అన్ని కులాల వారు తమవంతు సహకారం అందించారని వెల్లడించారు.