ఏపీ రాజధాని(AP Capital)పై సీఎం జగన్(CM Jagan) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందన్నారు. విశాఖలో జరిగిన ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.
విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటే నగరం బహుముఖంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు వెనుక తనకేమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవన్నారు. రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. బెంగళూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్‌కు ఉందని సీఎం జగన్ అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, వైజాగ్‌లో అయితే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయని చెప్పారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామని, విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌గా మారుస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయన్నారు.
సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1గా ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చాక 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని సీఎం చెప్పారు. అదేవిధంగా 1.5 కోట్ల మహిళలు స్వయం ఉపాధిని సాధించారన్నారు.
అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్ రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు సీఎం జగన్. రాష్ట్ర జీఎస్డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62శాతం ఉండగా, ఏపీలో 40శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణలో 3.12 లక్షలు ఉంటే ఏపీలో 2.9లక్షలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.