బేబీ సినిమా(baby movie)పై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(cv anand) ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబీ సినిమాలోని కొన్ని సన్ని వేశాలు మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. బేబీ సినిమాలో వున్నటు వంటి సన్ని వేశాలే ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో తాము రైడ్ చేసినప్పుడు తమకు కనిపించాయని చెప్పారు.
సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని వెల్లడించారు. సినిమాల్లో అలాంటి సన్ని వేశాలు పెట్టినప్పుడు హెచ్చరిక లైన్స్ అని వేయాల్సి వుంటుందన్నారు. కానీ అలాంటి కాషన్ లైన్స్ వేయకుండా సినిమా యూనిట్ ఆ సన్ని వేశాలను ప్లే చేసిందన్నారు. దీంతో సినిమా యూనిట్ ను తాము హెచ్చరించగా మళ్లీ కాషన్ లైన్స్ వేశారన్నారు.
బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇక నుంచి అన్ని సినిమాలపై తాము ఫోకస్ పెడతామని చెప్పారు. అలాంటి సన్ని వేశాలు ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా బేబీ సినిమాలోని అభ్యంతరకర సన్ని వేశాలను సీపీ ప్లే చేసి మీడియాకు వివరించారు.
మరోవైపు ప్రముఖ హీరో నవదీప్ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను నవదీప్ వినియోగించినట్టు రాంచంద్ సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. గతంలో టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులోనూ నవదీప్ పేరు వినిపించింది.
ఆ సమయంలో ఎక్సైజ్‌తో పాటు ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం నవదీప్ పరారీలో వున్నట్టు సీపీ వివరించారు. దీనిపై హీరో నవదీప్ స్పందించారు. మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసుతో తనకు సంబంధం లేదన్నారు. తాను పారిపోలేదని, తాను ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.