– మహిళా బిల్లు క్రెడిట్ కోసం పార్టీల పాట్లు
– అంతా కవిత వల్లేనంటున్న బీఆర్ఎస్
– డ్రామాలు ఆపాలని కాంగ్రెస్ కౌంటర్
– మహిళా బిల్లు కాంగ్రెస్ మానస పుత్రిక అంటున్న నేతలు
– మోడీ కృషి వల్లే ఇది సాధ్యమైందంటున్న బీజేపీ
మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens’s Reservation Bill) ఆమోదం చివరి అంకంలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు క్రిడెట్ కోసం తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) నేతలు మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ (Satyawathi Rathod) మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు పోరాడిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉద్యమం వృథా కాలేదని, ఆమె పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని అన్నారు. కవిత వల్లే లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతున్నాయని చెప్పారు. అంతేకాదు, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ (CM KCR) పెద్ద పాత్ర పోషించారని అన్నారు సత్యవతి రాథోడ్. ఈమే కాదు ఇంకా ఇతర గులాబీ నేతలు కవిత నిర్విరామ పోరాట ఫలితం వల్లే ఇది సాధ్యమౌతోందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు మండిపడుతున్నారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఈడీ విచారణను డైవర్ట్ చేయడానికే కవిత మహిళా బిల్లు డ్రామా మొదలు పెట్టారని విమర్శలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న మహిళా బిల్లు రాగం అందుకున్న కవిత వల్లే ఇది జరిగితే.. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హయాంలోనే మహిళలకు అధిక పాధాన్యం ఇస్తూ లోకల్ ఎన్నికల్లో సీట్లు ఎక్కువ కేటాయించిన తమ పార్టీ పాత్ర లేదా? అని కాంగ్రెస్ (Congress) నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తాజాగా దీనిపై స్పందిస్తూ.. కేబినెట్ లో ఒక్క మహిళ లేరని తండ్రిని అడిగే ధైర్యం లేని కవిత మహిళా బిల్లు కోసం పోరాటం చేశారంటే ఎవరు నమ్ముతారని అన్నారు. వినేవాళ్లు ఉంటే చంద్రయాన్ రాకెట్ నేనే చేశా అని కవిత చెబుతారేమో అంటూ సెటైర్లు వేశారు. మహిళా బిల్లు కాంగ్రెస్ మానస పుత్రిక అని చెప్పిన ఆయన.. ఈ బిల్లును కాంగ్రెస్ స్వాగతిస్తోందని తెలిపారు.
మరోవైపు, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ (BJP) నేతలు అంటున్నారు. మహిళల తరుపున ప్రధాని మోడీ (PM Modi), కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ (NDA) ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీలో, ఏ ఒక్క కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని బీఆర్‌ఎస్ వల్లే ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతోందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. మొత్తంగా మహిళా బిల్లు క్రెడిట్ కోసం పార్టీలు తెగ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది.