– మరోసారి తెరపైకి సీతారాంపూర్ భూముల వ్యవహారం
– సీబీఐకి ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానరసేన
– షేక్ పేట ల్యాండ్స్ పైనా కంప్లయింట్
– కేటీఆర్, రంజిత్ రెడ్డిపై చర్యలకు వినతి
కేసీఆర్ పాలనలో అనేక భూములు ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. సీతారాంపూర్, షేక్ పేటలోని ఆలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతం కావడంతో పెద్ద దుమారాన్నే రేపాయి. హిందూ సంఘాలు అనేక సార్లు ధర్నాలు దిగాయి. ఎన్నో ఫిర్యాదులు చేశాయి. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రీయ వానరసేన సీబీఐని ఆశ్రయించింది. సీతారాంపూర్ లోని 1148.12 ఎకరాల ఆలయ భూముల ఆక్రమణపై ఫిర్యాదు చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ పైనా, దానికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటు, జూబ్లీహిల్స్ లోని షేక్ పేట్ పరిధిలోని హనుమాన్ టెంపుల్ ఆలయ భూముల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానరసేన అధ్యక్షుడు రామ్ రెడ్డి. కేటీఆర్ పైనా, ఎంపీ రంజిత్ రెడ్డి, ఐఏఎస్ అమోయ్ కుమార్, శ్యాంప్రసాద్ రెడ్డి(ఇందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్) పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 1148.12 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా సర్కారు సేకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం దానిని అప్పగించింది. ఈ క్రమంలో దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోయినా మొండిగా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లిందనే విమర్శలు వచ్చాయి. సీతారాంపూర్ లోని 350 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి ఆలయానికి సర్వే నెంబరు 1663 నుంచి 1673 వరకు 1,148.12 ఎకరాల భూమి ఉంది. ఇది కాకుండా షాద్ నగర్ సమీపంలోని రంగంపల్లిలో మరో 148 ఎకరాల ల్యాండ్ ఉంది. రాజా లక్ష్మణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ భూములను రాములోరికి కానుకగా ఇచ్చారు.
ఆలయ మనుగడ కోసం వివిధ వృత్తి పనులు చేసేవారికి దేవాలయ భూమిలో కొంత భూమిని ఉచితంగా సాగు చేసుకునేందుకు ఇచ్చారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆలయాన్ని చూసుకునేలా ఏర్పాటు చేశారు. అయితే.. పారిశ్రామిక పార్కు ఏర్పా టు కోసం ప్రభుత్వం ఈ రాములోరి భూములను సేకరించింది. గ్రామ సభలు నిర్వహించినా.. ఎవరి అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. పైగా దేవాదాయ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గ్రామసభలు నిర్వహించిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే రాష్ట్రీయ వానరసేన కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నిరసనలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐకి ఫిర్యాదు చేసింది.
మరోవైపు, షేక్ పేట పరిధిలోని ఫిలింనగర్ హనుమాన్ టెంపుల్ భూముల విషయంలోనూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. 2007లో వైఎస్ హయాంలో ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించారు. డెక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా బాచుపల్లిలోని 90 ఎకరాల భూమిని ఇందూ ప్రాజెక్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఒక్కో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రూ.369 కోట్లకు విక్రయం జరిగింది. ఇందులో రూ.200 కోట్లు ఇందూ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది. తర్వాత కొందరు ఆ భూములు తమవంటూ కోర్టుకెక్కారు. దీంతో రిజిస్ట్రేషన్స్ జరగలేదు. దీనిపై ఇందూ సంస్థ కోర్టుకు వెళ్లింది. ఆలస్యమైనా సరే తమకు మరో చోట భూమిని కేటాయించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఇందూ సంస్థ చెల్లించిన రూ.200 కోట్లకు సమాన విలువ చేసే భూమిని మరో చోట కేటాయించాలని ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు.. ఇందూ ప్రాజెక్ట్ కు చెందిన మరో సంస్థ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ కి ఫిలింనగర్ లోని సర్వే నెంబర్ 403లో కొండ ప్రాంతమైన షేక్ పేట నాలా, రామానాయుడు స్టూడియో నుంచి ఓల్డ్ ముంబై హైవేకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో 10 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. అయితే.. ఇందూ సంస్థ చెల్లించిన మొత్తం కంటే ఈ భూమి విలువ ఇంకా ఎక్కువనే వాదనలు ఉన్నాయి. ఈ స్థలాన్ని దక్కించుకున్న రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ చుట్టూ పెద్ద రేకులతో ప్రహారీ నిర్మించింది. అయితే ఇదే స్థలంలో చాలాకాలంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చుట్టుపక్కల వారు ఆంజనేయుడికి ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడది ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లడంతో లోపలికి ఇతరులను అనుమతించట్లేదు. ఆలయానికి 200 గజాల స్థలం ఇస్తామని ఆ సంస్థ యజమానులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే దారి లేకుండా కేవలం ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు నిరసనలు కొనసాగించారు. ఇదే క్రమంలో రాష్ట్రీయ వానరసేన సీబీఐకి ఫిర్యాదు చేసింది.