హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె 12 ఏళ్లుగా బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. శ్రీవిద్య ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారుల వేధింపుల వల్లే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద ధర్నాకు దిగారు. కండెక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. బండ్లగూడ డిపో డీఎం వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కండక్టర్ శ్రీవిద్య తల్లి ఆరోపించింది.
శ్రీవిద్యను ఈనెల 12న సస్పెండ్ చేశారు. దీంతో ఆమె మనస్తాపంతో బీపీ మాత్రలు ఎక్కువగా వేసుకుని స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు కమీన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. ఆమె ఆత్మహత్యపై కుమారుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.