– కాంగ్రెస్, బీజేపీలో మేనిఫెస్టోల సందడి
– 17న రాష్ట్రానికి రాహుల్, ఖర్గే
– కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనకు ఛాన్స్
– ఇప్పటికే గ్యారెంటీలు, డిక్లరేషన్ల ప్రకటన
– హస్తం ఇంకేం హామీలు ఇవ్వనుంది?
– 18న తెలంగాణకు అమిత్ షా
– బీజేపీ మేనిఫెస్టో విడుదలకు అవకాశం
– బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా వరాలు ఉంటాయా?
సౌభాగ్య లక్ష్మి పేరుతో మహిళలకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్ రూ.5 వేలు, రైతు బంధు రూ.16 వేలు, బీమా కింద రూ.5 లక్షలు.. ఇలా హామీల వర్షం కురిపించి కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ (BRS) మేనిఫెస్టోను వదిలారు ఆపార్టీ అధినత కేసీఆర్ (KCR). ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న గులాబీ నేతలు వీటినే ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాయి. మంత్రి కేటీఆర్ (KTR) అయితే.. మరీ ముఖ్యంగా సౌభాగ్య లక్ష్మి పథకం, పెన్షన్ గురించి మహిళలకు వివరిస్తూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ రేసులో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వెనుకబడ్డాయనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రానికి అగ్ర నేతలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటిదాకా మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే.. ఇప్పుడా టైమ్ వచ్చేసిందని ఇరు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన హస్తం పార్టీ.. ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక సమావేశాలు, సభలు, రోడ్ షోలు, చేరికలకు ప్లాన్ చేసింది రాష్ట్ర నాయకత్వం. అంతేకాదు, ఖర్గే చేతులమీదుగా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గ్యారెంటీలతోపాటు వరాల వర్షం
మహాలక్ష్మి, కాంగ్రెస్ రైతు భరోసా, తెలంగాణ గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, కాంగ్రెస్ చేయుత పేరుతో ఆరు గ్యారెంటీ స్కీములను ప్రకటించిన కాంగ్రెస్.. వీటికి అదనంగా ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలను వివరిస్తూ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని అంటున్నాయి పార్టీ వర్గాలు. కొన్నాళ్లక్రితం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్న టీపీసీసీ.. ప్రజలు, వివిధ వర్గాల నేతలు, ప్రజా సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. వాటన్నింటిని క్రోడీకరించుకుని ఇతర పార్టీలకు ధీటైన పథకాలకు ప్లాన్ చేసింది. కళ్యాణ లక్ష్మికి అదనంగా పెళ్లి కూతురుకి తులం బంగారం ఇస్తామని పార్టీ ముఖ్యనేతలు ఇప్పటికే ప్రకటించారు. రైతు, నిరుద్యోగ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలకు తామేం చేయబోతున్నామో వివరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించబోయే పూర్తి స్థాయి మేనిఫెస్టోపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఒకరోజు తర్వాత బీజేపీ మేనిఫెస్టో
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 18న తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు 4 సభలకు ప్లాన్ చేసింది రాష్ట్ర నాయకత్వం. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ లో బహిరంగ సభలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే.. అదే రోజు బీజేపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న కమలం పార్టీ… బీసీ సాధికారిత, నగరాల పేర్ల మార్పు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, బీమా కవరేజీ వంటి హామీలను ప్రకటించనుందని సమాచారం. ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికీ జీవిత బీమా, క్వింటాల్ కు రూ.3,100 చొప్పున ధాన్యం కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు, ప్రతి మహిళకు ఏడాదికి 12 వేల రూపాయల సాయం, రూ.500 సిలిండర్ అందించడం వంటి హామీలు ఇవ్వనుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం. మొత్తంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు హామీల వర్షం కురిపించేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి.