తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆ పార్టీ నేతలు తెగ హడావుడి చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఒక్కసారిగా వారంతా సైలెంట్ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) ఫోకస్ చేయగా మంత్రులు మాత్రం ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇస్తున్నారు.
పవర్‌లోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం(MIM)కు దూరంగా ఉన్నది. ఇటీవల పాతబస్తీలో మెట్రో ట్రైన్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపారు. నాటి నుంచి ఎంఐఎం పార్టీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పొత్తు కటీఫ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సొంత పార్టీ నేత నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ (Firozkhan) కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గురువారం ఓ మీడియా చానల్‌తో ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాంపల్లిలో అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు ఇచ్చాడని.. అయితే, అందులో మాకు 50 శాతం, ఎంఐఎంకు 50 శాతం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని కామెంట్ చేశారు.
ఇలాంటి చాలా ఇండికేషన్స్‌తో భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కాంప్రమైజ్ అవుతదని, ఆ పార్టీ వర్కర్‌గా తనకు అర్థం అవుతుందన్నారు. ఇక ఎంఐఎంతో పొత్తుల అంశంపై ఫిరోజ్ ఖాన్ రెగ్యులర్‌గా చేస్తున్న కాంమెట్స్ ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.