నారాయణఖేడ్ (Narayan Khed) నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో కర్ణాటక రైతులను కాంగ్రెస్ (Congress) శ్రేణులు అడ్డుకున్నాయి. వాళ్ల చేతుల్లో ప్లకార్డులను కాంగ్రెస్ నేతలు లాక్కున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదర గొట్టారు.
కర్ణాటక రైతుల పేరిట గూండాలను బీఆర్ఎస్ నేతలు తీసుకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వారితో కాంగ్రెస్ పై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు వారిని అడ్డుకున్నామని తెలిపారు.
ఇది ఇలా వుంటే రంగారెడ్డి జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల నిరసన చర్చనీయాంశంగా మారింది. పరిగిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షో నేపథ్యంలో కొండగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు కర్ణాటక రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రైతుల దగ్గర నుంచి కాంగ్రెస్ నేతలు ప్లకార్డులను గుంజుకుని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
ర్యాలీ నిర్వహించిన రైతులనను మీడియా ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు మనిషికి రూ. 300 ఇస్తామంటే తాము ఇక్కడకు వచ్చామన్నారు. తాము మొత్తం తొమ్మిది మంది జీప్లో వచ్చామన్నారు. జీప్ దిగాక కార్లలో వచ్చిన కొందరు తమ చేతికి ప్లకార్డులు ఇచ్చారని వెల్లడించారు. అంతకు మించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.