మంత్రి కేటీఆర్ (KTR) పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ (Congress) ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల వేళ అధికార భవనాలను మంత్రి దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తు టీ హబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొంది.
రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దర్యాప్తు మొదలు పెట్టింది. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో యువతతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం కోసం టీ హబ్ ను ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు.
ఇది ఇలా వుంటే అమరవీరుల స్మారకం ప్రాంగణంలో ఇటీవల కేటీఆర్, గోరెటి వెంకన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మరోవైపు ప్రభుత్వ భవనంలో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించాలని సంబంధిత రిటర్నింగ్ అధికారిని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంటర్వ్యూ నిర్వహించినందుకు నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రదేశంలో డ్రోన్ కూడా ఎగురవేసినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ నాయకులు ప్రభుత్వ సంస్థలను వారి కార్యకలాపాల కోసం వినియోగించుకోరాదని పోలీసులు వెల్లడించారు.