గులాబీ పార్టీ కంచుకోట కాంగ్రెస్ (Congress) కన్నేసినట్టు తెలుస్తోంది.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament elections) ఎలాగైనా ఆ కంచుకోటను బద్దలు గొట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట(Siddipet) బీఆఎస్(BRS)కు కంచుకోటగా పేరొందింది.
ఎందుకంటే సిద్దిపేటకు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇక గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మామ అల్లుళ్లలను కొట్టేవారే లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.
అదే జరిగితే సిద్ధిపేట,గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో చక్రం తిప్పొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే హుస్నాబాద్ నుంచి రవాణాశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మిగిలిన సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్‌పై పట్టుబిగించాలని హస్తం పార్టీ అధిష్టానం చూస్తోంది.
అందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఆ పార్టీనేతలు మెదక్ పార్లమెంటు పరిధిలో వరుసగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ఉన్నారు. అందుకే ఇటీవల మైనంపల్లి హన్మంతరావు చలో సిద్దిపేటకు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
మంత్రులు కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా విరివిగా పర్యటిస్తూ ఇక్కడి ప్రాంతంపై పట్టుసాధించాలని చూస్తున్నట్లు వినికిడి. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట నియోజక వర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి
చెరుకు శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలను హస్తం పార్టీలో చేరారు.
రానున్న రోజుల్లో మరిన్ని చేరికల ద్వారా స్థానికంగా పట్టు సాధించి సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అధికార పార్టీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.