అధికార పార్టీకి ఉన్న విలువ ప్రతిపక్షానికి ఉండదని తెలిసిందే.. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎవరు అంతగా పట్టించుకోని పార్టీగా ఉన్న కాంగ్రెస్ (Congress).. అనంతరం అధికారంలోకి వచ్చాక ఒక్క సారిగా పొలిటికల్ పవర్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం సీట్లు హాట్ కేకుల్లా మారాయి.. తమకంటే తమకు ఇవ్వాలని నేతలు కుస్తీలు పడుతున్న వార్తలు నిరంతరం వినిపిస్తున్నాయి..
ఈ సమయంలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. మాదిగ సామాజికవర్గం నుంచి నిరసన సెగ తగులుతుంది. ఇప్పటికే మొత్తం 17 స్థానాల్లో 13 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్.. వరంగల్ (Warangal) స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే ఈ సీటును మాదిగ కమ్యూనిటీ అభ్యర్థికే ఇవ్వాలని ఆ సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పదుల సంఖ్యలో పిడమర్తి రవి (Pidamarthi Ravi) మద్దతుదారులు ఏఐసీసీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. వరంగల్ ఎంపీ స్థానంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సైతం మాదిగ కమ్యూనిటీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. ఈమేరకు గాంధీభవన్లో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చిన వీరు మరో అడుగు ముందుకేసి.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిసి డిమాండ్ చేశారు.
తాజాగా ఢిల్లీ (Delhi) ఏఐసీసీ (AICC) కార్యాలయాన్ని వేదికగా మలచుకొని నిరసనలకు దిగారు.. రాష్ట్రంలో మాలలకంటే మాదిగల జనాభా ఎక్కువ ఉందని, మా కమ్యూనిటీకి రెండు ఎంపీ స్థానాలను కేటాయించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.. జనాభాకు అనుగుణంగా టికెట్ల కేటాయింపు జరగడం లేదని మండిపడ్డారు.. పెండింగ్లో ఉన్న వరంగల్ సీటును, కంటోన్మెంట్ స్థానాన్ని మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..