Telugu News » KTR : స్కాంగ్రేసా..! మరి మీది స్కాముల సర్‘‘కారు’’ కాదా!!

KTR : స్కాంగ్రేసా..! మరి మీది స్కాముల సర్‘‘కారు’’ కాదా!!

జాతీయ ఛానల్ వీడియోను షేర్ చేస్తూ.. ‘స్కాంగ్రెస్.. దాని నిజ రూపాలు’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

by admin

– కేటీఆర్ సెటైర్..కాంగ్రెస్ కౌంటర్
– కర్ణాటక కమీషన్ల వ్యవహారంపై స్పందన
– ‘స్కాంగ్రెస్.. దాని నిజ రూపాలు’ అంటూ ట్వీట్
– కాంగ్రెస్ వర్గాల ఎదురుదాడి
– గురివింద కథలొద్దు అంటూ కౌంటర్స్
– బీఆర్ఎస్ స్కాములు, కమీషన్లపై ప్రశ్నల వర్షం
– కాళేశ్వరం కట్టింది కాంట్రాక్టర్ల కోసమే..
– మిషన్ బగీరథ నీళ్లు కాదు.. డబ్బులు పారాయి
– దళిత బంధు కమీషన్లు
– ధరణి పేరుతో దందాలు
– స్కీముల పేరుతో స్కాములు
– సోషల్ మీడియాలో కేటీఆర్ పై కౌంటర్ ఎటాక్

కర్ణాటక (Karnataka)లో కమిషన్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల సమయంలో ఈ అంశాన్నే కాంగ్రెస్ (Congress) ప్రచారాస్త్రంగా మలుచుకోవడంతో విజయం చేరువైంది. కానీ, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ కూడా కమీషన్ల దందాకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం (CM) సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతిని బెంగళూరులోని ప్రజా పనుల శాఖకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు బయటపెట్టారు. రెండేళ్లకు పైగా తాము చేబట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటివరకు క్లియర్ కాలేదని.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వద్ద మొర పెట్టుకుంది.

congress fire on ktr

ప్రస్తుతం ఈ వార్త బెంగళూరు (Bengaluru) రాజకీయాలపైనే కాదు జాతీయ పాలిటిక్స్ పైనా ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తూ ఇతర పార్టీల నేతలు విమర్శల దాడికి దిగారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఈ వ్యవహారంపై స్పందించారు. ట్విట్టర్ లో ఓ జాతీయ ఛానల్ వీడియోను షేర్ చేస్తూ.. ‘స్కాంగ్రెస్.. దాని నిజ రూపాలు’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వర్గాలు కేటీఆర్ ట్వీట్ పై ఎటాక్ మొదలుపెట్టాయి. గురివింద సామెతను గుర్తు చేస్తూ మీ సంగతేంటి చిన్నసారూ.. అంటూ సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నాయి.

2014లో కేసీఆర్ సీఎం అయింది మొదలు.. గులాబీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, స్కాముల వివరాల్ని, వాటికి సంబంధించిన వార్తల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వేల కోట్లతో కాళేశ్వరం కట్టిన కేసీఆర్.. నిపుణుల మాట లెక్కచేయకుండా గ్రామాలను వరదతో ముంచేస్తున్నారని విమర్శిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్టు వల్ల కల్వకుంట్ల ఫ్యామిలీ, కట్టిన కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడ్డారని ప్రజలకు అదనపు భారం తప్ప దాని వల్ల ఉపయోగం చాలా తక్కువేనని అంటున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో గట్టెక్కడానికి దళిత బంధు తెచ్చిన కేసీఆర్.. ఆ పథకంలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకుంటుంటే ఏం చేస్తున్నారని నిలదీస్తున్నాయి.

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలకు తప్ప సాధారణ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అని.. 40 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఇంటింటికి నీళ్లు రావడం లేదని విమర్శలు చేస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారని మండిపడుతున్నాయి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ఆరోపిస్తున్నాయి. ఇక భూముల పేరుతో జరుగుతున్న దందా అంతా ఇంతా కాదని.. ధరణి తెచ్చి సామాన్యులకు నరకం చూపిస్తూ ఒకప్పుడు స్కూటర్ పై తిరిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారని వివరిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉందని.. ఈసారి ప్రజలు కేసీఆర్ ను ఫాంహౌస్ కే పరిమితం చేస్తారని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై అనవసర నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి.

You may also like

Leave a Comment