– బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన అధికారులపై ఫోకస్
– ఇప్పటికే శివ బాలకృష్ణ అరెస్ట్
– సోమేశ్ కుమార్ ఆస్తులపై కాంగ్రెస్ నజర్
– 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలుపై అనుమానాలు
బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గులాబీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఇతర పార్టీలు అనేక విమర్శలు చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాలనపై పట్టు సాధించే పనిలో ఉంది. పాలనా యంత్రాంగంలో భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వరకు బదిలీలు చేసింది. అయితే.. బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న ఒక్కో అధికారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
ఇటీవల ఫార్ములా ఈ-రేస్ కు సంబంధించి జరిగిన ఒప్పందంపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ కు మెమోలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి ఈ రేస్ కు బదిలీ చేశారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఆయన రిమాండ్ లో ఉన్నారు.
ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. తన భార్య పేరుపై ఆయన 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249, 260లో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని.. ఈ కొనుగోలు విషయంలో డీఓపీటీకి సోమేష్ సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వ్యవహరంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విధంగా ఇంకా చాలామంది అధికారులు అక్రమంగా భూములు కొనుగోలు చేసి.. ఆస్తులు కూడబెట్టారని అంటున్నారు.