– కాంగ్రెస్ లో ఆగని టికెట్ల లొల్లి
– అధిష్టానంపై నేతల అసంతృప్తి
– బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి
– అసంతృప్తులతో హైకమాండ్ చర్చలు
– నేనున్నానంటూ కేసీ వేణుగోపాల్ హామీ
– టికెట్ రాకపోయినా..
– పార్టీ విజయం కోసం పోరాడదామన్న అద్దంకి
– బీఎస్పీ గూటికి నీలం మధు
ఈసారి విజయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్. ఓవైపు చేరికలతో ఫుల్ జోష్ లో ఉండగా.. ఇంకోవైపు ఎన్నికల ప్రచారాన్ని కొత్త పంథాలో ముందుకు తీసుకెళ్తోంది. ఇదే క్రమంలో పెండింగ్ లో ఉంచిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. చివరి విడత జాబితాను తాజాగా ప్రకటించింది. చార్మినార్ కు ముజీబ్ షరీఫ్, తుంగతుర్తి(ఎస్సీ)కి మందుల శామ్యూల్, మిర్యాలగూడకు బాతుల లక్ష్మారెడ్డి, సూర్యాపేటకు రామిరెడ్డి దామోదర్ రెడ్డిని ఎంపిక చేసింది. పటాన్ చెరు స్థానానికి అభ్యర్థిని మార్చింది. అయితే.. టికెట్లు రాని ఆశావహులు అసంతృప్తిలో ఉన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి పటేల్ రమేష్ రెడ్డి భంగపడ్డారు. హై కమాండ్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ను కేటాయించింది. దీంతో రమేష్ రెడ్డి బోరున విలపించారు. ఆయన ఫోన్ లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
హుందాగా ప్రవర్తించిన అద్దంకి
తుంగతుర్తి స్థానం నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేయాలనుకున్నారు. కానీ, అధిష్టానం సీటు నిరాకరించింది. దీనిపై ఆయన పాజిటివ్ గానే స్పందించారు. హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టు బానిసనని ప్రకటించారు. అన్ని రకాల విశ్లేషణలు చేసిన తరువాత గెలుపే లక్ష్యంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం అని చెప్పారు. నిజమైన కార్యకర్తగా, ఉద్యమ నేతగా దీన్ని గౌరవిస్తూ శ్యామ్యూల్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు. తన మిత్రులు, సన్నిహితులు ఎవరూ పార్టీని ఇబ్బంది పెట్టే కామెంట్లు, ఏ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు.
పటాన్ చెరు విషయంలో ట్విస్ట్
పటాన్ చెరు అభ్యర్థిగా ముందు నీలం మధును ఎంపిక చేసింది అధిష్టానం. అయితే.. కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సీటుపై రచ్చ కొనసాగగా చివరకు కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించింది హైకమాండ్. దీంతో నీలం మధు బీఎస్పీలో చేరారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. టికెట్ ఇవ్వకుండా మొన్న బీఆర్ఎస్ మోసం చేస్తే, ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు నీలం మధు.
అసంతృప్తులతో చర్చలు
టికెట్ రాని నేతలతో తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఎన్ఎస్యూఐ నేత వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, బలరాం నాయక్, పారిజాత నరసింహారెడ్డితో సహా 20 మందికి వేణుగోపాల్ భరోసా ఇచ్చారు. టికెట్ రాలేదని అధైర్య పడొద్దని, తెలంగాణలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని, ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని హామీ ఇచ్చారు. ‘మీ రాజకీయ భవిష్యత్తుకు బాధ్యత నాది’ అంటూ వేణుగోపాల్ వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం.