తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మాదిగల వ్యతిరేక పార్టీగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు(MRPS Founder) మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాలలకు తలొగ్గి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్లు కేటాయించకుండా విస్మరించిందని ఆయన విమర్శించారు. సోమవారం మిర్యాలగూడలోని టీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఓట్లకోసం వస్తే గ్రామాల్లోనే అడ్డుకోవాలని మందకృష్ణ మాదిగ సామాజిక వర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి మాదిగలపై ఏ మాత్రం కృతజ్ఞత చూపించడం లేదని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రధాని నరేంద్రమోడీతోనే సాధ్యం అవుతుందని మందకృష్ణ పేర్కొన్నారు.
మూడోసారి ప్రధానిగా మోడీని చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పార్టీ ఇప్పటికే ఇద్దరు మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయించిందని గుర్తుచేశారు. రాజకీయ ప్రాతినిధ్యమైనా బీజేపీతోనే సాధ్యం అవుతుందని, మూడోసారి ప్రధానిగా మోడీని ఎన్నుకునేందుకు మాదిగలు, బీసీలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.