తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా (CM) రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు రేవంత్ రెడ్డి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
8 అగస్టు 1969న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లెలో జన్మించారు. తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామ చంద్రమ్మ. ఆయనకు మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఓయూలో అనుబంధ కళాశాల ఏవీ కాలేజీలో డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచే వారు. పాఠశాలలో చదువుతున్న సమయంలో విద్యార్థి నేతగా పని చేశారు.
ఆ సమయంలో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు. ఈ క్రమంలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పెయింటర్ గా, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్‌గా, రియల్ ఎస్టేట్ రంగాల్లో పని చేశారు. 2001లో ఆర్ఎస్ఎస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించగా ఆయనకు దక్కలేదు. ఆ తర్వా త జెడ్పీటీసీ టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఈ క్రమంలో 2008లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2008లో రేవంత్ రెడ్డికి చంద్రబాబు కొడంగల్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఆయన పనితీరు గమనించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019లో మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 2021లో పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. 2023 ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు. కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయన సీఎం పదవి చేపడుతున్నారు.