Telugu News » Congress : వీళ్లంతా రెండు చోట్ల నుంచేనా?

Congress : వీళ్లంతా రెండు చోట్ల నుంచేనా?

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. రెండు చోట్ల నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు.

by admin
Congress High Command Focus On Unsatisfied Leaders And Election Campaign

– కేసీఆర్ బాటలో కాంగ్రెస్ కీలక నేతలు
– ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ
– బీఆర్ఎస్ ఓటమే లక్ష్యం
– ఈటల కూడా ఇదే దారిలో!

ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ (Gajwel) తోపాటు కామారెడ్డి (Kamareddy) నుంచి బరిలోకి దిగుతున్నారు. సీఎం రెండు సీట్లలో పోటీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గజ్వేల్ లో ఓటమి భయం అని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender).. గతంలో తాను చేసిన సవాల్ నేపథ్యంలో కేసీఆర్ పై పోటీకి గజ్వేల్ లో తొడ కొట్టారు. హుజూరాబాద్ (Huzurabad) తోపాటు గజ్వేల్ లో ఆయన పోటీ చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ (Congress) నేతలు కూడా ఇదే దారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. రెండు చోట్ల నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి బరిలో ఉంటానని అన్నారు. అంతేకాదు, హైకమాండ్ ఓకే అంటే భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పారు. దీంతో అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెండేసి స్థానాల్లో పోటీకి సై అంటున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఢీ కొడతానని అంటుంటే.. కేటీఆర్ పై ఉత్తమ్, హరీష్ రావుపై కోమటిరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. హుజుర్ నగర్ తోపాటు సిరిసిల్లలో ఉత్తమ్, నల్లగొండతో పాటు సిద్దిపేటలో వెంకట్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కట్టడి చేసే ఆలోచనలో భాగంగానే వీరంతా రెండుచోట్ల పోటీపై దృష్టి పెట్టినట్లు అనుకుంటున్నారు.

కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ ప్రకటన ఆలస్యానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. ఏఐసీసీ వార్ రూం డైరెక్షన్ లోనే వీరంతా రెండు సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఫైనల్ అయ్యాకే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడుతోపాటు అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ లో కేసీఆర్ ను ఢీ కొడతానని అంటున్నారు. దీనిపై ఆయన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయి చర్చించారు. మొత్తంగా.. బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ పెద్ద స్కెచ్ వేసిందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అభ్యర్థులు లేక ఇలా చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నాయి.

You may also like

Leave a Comment