అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) సమర్థించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ఉద్దేశించింది కాదన్నారు.
ఏ మతాన్ని బాధపెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రధానమంత్రి ఏమి చేస్తున్నారు? అన్నదే తమ సమస్య ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పేద ప్రజల కోసం ఆయన ఏమి చేస్తున్నారు? పేద ప్రజల కోసం ఆయన ఏమి చేస్తున్నారనేది తమ సమస్య అని అన్నారు.
విశ్వాసం ఉన్నవారు ఈరోజే (ఆలయానికి) వెళ్లవచ్చు లేదా రేపు కూడా వెళ్లవచ్చన్నారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ధర్మ శాస్త్రాలు, విధి విధానాల ప్రకారం జరగడం లేదన్నారు. ఈ మహాక్రతువును బీజేపీ ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. నిర్మాణం పూర్తికాకుండా ఆలయాన్ని ప్రారంభించటం మహాపాపమన్నారు.
ఇదే విషయాన్ని దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు చెబితే వారిని పక్కనపెట్టారని పేర్కొన్నారు. ఆలయ ప్రారంభ తేదీని పంచాంగం చూడకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారని ఆరోపణలు గుప్పించారు. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. తాము పార్టీ తీసుకున్నది సరైన నిర్ణయమని తాను భావిస్తున్నానని వెల్లడించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని తాను నమ్ముతానని చెప్పారు.
మతంతో రాజకీయాలను కలపకూడదన్నారు. కానీ భారతదేశంలో మతాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. కాంగ్రెస్ నిర్ణయంలో కొత్తేమీ లేదన్నారు. గతంలో పార్లమెంట్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించారని గుర్తు చేశారు.
అది వారి అహంకారం మాత్రమేనన్నారు. అందుకే వారు అలాంటి పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు.