– గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు
– మోడీ టూర్లతో బీజేపీ లో పెరిగిన జోష్
– అదే జోష్ ను తమ పార్టీ శ్రేణుల్లో..
– నింపే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్
– తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
ప్రధాని మోడీ (PM Modi) వరుస పర్యటనలు బీజేపీ (BJP)కి బూస్టప్ ఇచ్చాయి. పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇది తగ్గకుండా ఉండేందుకు జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. అయితే.. కాంగ్రెస్ (Congress) పార్టీ సైతం ఇదే ప్లాన్ ను అమలు చేస్తోంది. ఈమధ్యే తెలంగాణ (Telangana) పర్యటనకు వచ్చిన అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని మరోసారి రంగంలోకి దింపుతోంది. మోడీ మూడు రోజుల్లో ఒక రోజు గ్యాప్ ఇచ్చి రెండు సార్లు తెలంగాణకు రాగా.. రాహుల్ గాంధీని ఏకంగా మూడు రోజులపాటు రాష్ట్రంలోనే ఉంచుతోంది కాంగ్రెస్.
ఈ నెల రెండో వారంలో రాష్ట్రానికి రానున్నారు రాహుల్. మూడు రోజుల పాటు ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ శాఖకు సమాచారం వచ్చింది. దీంతో ఏర్పాట్లు చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల వేళ రాహుల్ పర్యటనతో టీ కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. గత నెలలో తుక్కుగూడలో నిర్వహించిన విజయ గర్జన సభలో సోనియాగాంధీతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ తన ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు కురిపించారు.
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్.. దక్షిణాదిలోని మరో రాష్ట్రం తెలంగాణలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం ఫోకస్ తెలంగాణపై పెట్టింది. తరుచూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈమధ్యే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న క్రమంలో ఇప్పుడు రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని, దీని వల్ల క్యాడర్ లో మరింత ఉత్సాహం నింపాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నట్టు సమాచారం. నిజామాబాద్ లో మహిళా డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.