తెలంగాణలో కాంగ్రెస్ (Congress) తరఫున పోటీ చేసే రెండవ విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఇటీవలే బీజేపీ (BJP) నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Raja Gopal Reddy)కి మునుగోడు సీటును కాంగ్రెస్ కేటాయించింది. ఇక సికింద్రబాద్ కంటోన్మెంట్ నుంచి దివంగత విప్లవ ఉద్యకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చింది.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్- హుస్నాబాద్ నుంచి, మధు యాష్కీ-ఎల్బీ నగర్, షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, తుమ్మల నాగేశ్వరరావు- ఖమ్మం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- పాలేరు నుంచి బరిలోకి దించింది.
ఇది ఇలా వుంటే రాష్ట్రంలో రేపటి నుంచి రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది. రెండవ విడత బస్సు యాత్రలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మొదటి రోజు యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొననున్నారు.
రెండవ రోజు యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొంటారని వెల్లడించారు. మొదటి రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. రెండవ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లలో యాత్ర కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు.
మూడవ రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలో జనగామ ,ఆలేరు,భువనగిరి, నాల్గవ రోజు నల్గొండ ,నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగార్జున సాగర్, కొల్లాపూర్, ఐదవ రోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో జడ్చర్ల ,షాద్ నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలో యాత్ర ముగుస్తుంది.