తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతలంతా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నేతలు ప్రచారాల్లో మాట్లాడుతున్న మాటలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ (KTR) ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో గెలవడం కష్టమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇక్కడి ప్రజలకు కేటీఆర్ అందుబాటులో ఉండరని.. కొందరు బీఆర్ఎస్ నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటారనే టాక్ స్థానికంగా ప్రచారంలో ఉంది. అదీగాక పద్మశాలీల ఆత్మగౌరవ నినాదం బలంగా పాతుకుపోవడం వల్ల.. తమ వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి వైపే వారు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ (BRS) వర్గాలను కలవరపెడుతుంది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ స్థానిక నేతతో మాట్లాడిన ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గానికి చెందిన ఓ నేతకు పోస్ట్ చేసింది. ఓటమి భయంతోనే కేటీఆర్ సిరిసిల్ల పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారని హస్తం పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక ఆడియో విషయానికి వస్తే.. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉందని, వచ్చే మంగళవారంతో ప్రచారానికి తెరపడుతుందని.. ఇంటింటికీ ప్రచారం చేయాలని కేటీఆర్ కోరారు.
నియోజక వర్గంలో తాను ఓడిపోతానని క్రితం రోజు దినపత్రికలో ఎవరో రాశారని, అలాంటి వార్తలు పట్టించుకోవద్దని కేటీఆర్ ఆ ఆడియోలో కోరారు. బీఆర్ఎస్ పై వస్తున్న పుకార్లు పట్టించుకోవద్దని.. ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ఈ వారం మీరు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యండని ఆ ఆడియోలో కేటీఆర్ చెప్పిన క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం కేటీఆర్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.