అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు ఎదురు లేదు.. తనకన్న ఎవరు ఎక్కువ కాదని భావించారు.. కానీ కాలం ఒకటి సమాధానం చెబుతోందని గ్రహించ లేకపోయారు.. కాలం కలిసి వస్తే అందరూ హీరోలే.. కానీ అది తిరగబడితే.. హీరోలు అనుకొన్న వారు సైతం జీరోలు అవుతారని ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) బాస్ ని చూస్తే తెలుస్తుందని అనుకొంటున్నారు.. అదీగాక ప్రతిపక్షాలను చీమలుగా నలిపేశారనే ఆరోపణలు మెండుగా మూటగట్టుకొన్నారు..
కాలం కలసి వచ్చింది.. జీరో అనుకొన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం అయ్యారు.. ఆవేశపడలేదు.. నిదానంగా బీఆర్ఎస్ బలాలను బలహీనంగా మార్చారు.. ఇక అసలు కథ మొదలైంది. కాంగ్రెస్ (Congress)పై శాపనార్థాలు.. ఆరోపణలు.. విమర్శలు.. ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు జరుగుతున్నాయని హస్తం నేతలు నోటికి మైకు కట్టుకొని ప్రచారం చేయడం కనిపిస్తోంది. ఈ క్రమంలో సీఎం కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే..
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ (KCR)పై ఫైర్ అయ్యారు. రాష్ట్రం వచ్చాక పాలమూరుకు ఆయన చేసింది ఏంటని ప్రశ్నించారు. పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ ఇస్తే తాను నిర్మించారా అని నిలదీశారు. ఏం అభివృద్ధి చేశారని పాలమూరు ప్రజలను ఓటు అడుగుతున్నారని మండిపడ్డారు..
మరోవైపు కారు రిపేర్కు వెళ్లిందని కేటీఆర్ అన్న మాటలు గుర్తు చేసిన సీఎం.. కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని ఎద్దేవా చేశారు.. అలాగే కేసీఆర్ను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని మరచిపోతే ఎలాగని గుర్తు చేశారు.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్.. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు.