– ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
– తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
– 300 పేర్లను సిఫారసు చేసిన పీఈసీ
– పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లిస్ట్
తెలంగాణ (Telangana) లో ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలనేది కాంగ్రెస్ (Congress) ప్లాన్. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ భారీ హామీలను ప్రకటించింది. ఇవి అవికాని హామీలు అంటూ విమర్శలు ఎదురవుతున్నా.. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ధీమాగా చెబుతున్నారు హస్తం నేతలు. ఇప్పటికే ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు కలిసి జనాన్ని కలిసి ఆరు గ్యారెంటీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసే పనిలో ఉంది స్క్రీనింగ్ కమిటీ.
ఢిల్లీ (Delhi) లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం రెండోరోజు కూడా కొనసాగింది. కాంగ్రెస్ వార్ రూమ్ లో జరిగిన ఈ భేటీకి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి, మధు యాష్కీ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు.
119 నియోజకవర్గాలకు దాదాపు 300 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసింది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ. ఆ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనుంది స్క్రీనింగ్ కమిటీ. అక్కడ వడబోతతో ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి సీటు దక్కుతుందో అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు చాలామంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అప్లై చేసుకోగా పలుచోట్ల ఒక్కరు మాత్రమే ఆసక్తి చూపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు సీటు దక్కించుకుంటారో చూడాలి.