కాంగ్రెస్ (Congress) పై సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akilesh Yadav) మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ “ద్రోహం” చేయకూడదని అన్నారు. సమాజ్ వాది పార్టీతో కాంగ్రెస్ పొత్తు కావాలా ? వద్దా? అనే విషయం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్2లో సీట్ల విషయంలో విభేదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నాయకుడి నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని తెలిపారు. ఆ సీనియర్ నేత ఏదైనా చెబితే దాన్ని తాను ఫాలో కావాలంట అని పేర్కొన్నారు. అలా ఆ సందేశంలో తెలిపాడన్నారు. కానీ తాను ఒక విషయాన్ని స్పష్టం చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎస్పీతో కూటమి ఏర్పాటు వద్దు అనుకుంటే కాంగ్రెస్ ఎందుకు తమను పిలిచిందని ప్రశ్నించారు.
ఎస్పీకి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేయవద్దని కాంగ్రెస్ కు ఆయన సూచించారు. తమకు ద్రోహం చేయవద్దని కోరారు. సమాజ్ వాదీతో కూటమి తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేతలు సూటిగా చెప్పాలన్నారు. ఆ తర్వాత పొత్తు గురించి తాము ఒక్కసారి కూడా మాట్లాడబోమని స్పష్టం చేశారు. సొంతంగా బీజేపీని ఓడించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తామన్నారు.
పొత్తు లేకుంటే తమను ఎందుకు పిలిచారు? అని కాంగ్రెస్ ను ఆయన నిలదీశారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉండదని, లోక్సభ ఎన్నికల్లో కూటమి ఏర్పడుతుందని వారు మాకు ముందే చెప్పి ఉండాల్సిందని మండిపడ్డారు. ఇండియా కూటమి కేవలం జాతీయ స్థాయికి పరిమితమైందని తెలిసి వుంటే తాము మధ్య ప్రదేశ్ సమావేశానికి రావాలంటూ కాంగ్రెస్ చేసిన కాల్స్ సమాధానం ఇచ్చే వాళ్లం కాదన్నారు.