పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు పని తీరు. ఎంతో ప్రతిష్టాకంగా నిర్మించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే గానీ.. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు అదనపు భారమే తప్ప ఉపయోగం లేదని ప్రతిపక్షాలు మొదట్నుంచి చెబుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో నిపుణుల మాటలు కాదని కేసీఆరే (KCR) ఇంజనీర్ అవతారం ఎత్తి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో లోపాలు బయటపడుతున్నాయని తరచూ తిట్టిపోస్తుంటారు విపక్ష నేతలు. తాజాగా మరోసారి ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు వెలుగుచూశాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినట్టు తెలుస్తోంది. 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ దాకా పైన బ్రిడ్జి కుంగిపోయి కనిపిస్తోంది. బ్రిడ్జిపైకి ప్రయాణికులను పోలీసులు అనుమతివ్వడం లేదు. చీకటిపడడం.. నీళ్లు ఎక్కువగా ఉండటంతో పిల్లర్ల పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్ని పిల్లర్లు కుంగిపోయాయి.. పరిస్థితి ఏంటనేది కూడా తెలియడం లేదంటున్నారు.
ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గేట్ల నుంచి సౌండ్స్ వస్తున్నాయని.. తెల్లవారితే గానీ ఏమీ చెప్పలేమని ఆయన అంటున్నారు. ప్రస్తుతం 40 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ అంశం చుట్టూ వివాదం చెలరేగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏటీఎంలా వాడేస్తున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేస్తుంటాయి. గతంలో వరదల సమయంలో పంప్ హౌస్ మునిగిపోవడంతో ప్రాజెక్ట్ నిర్మాణంపై తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు పైన రోడ్డు కుంగిపోవడంతో పిల్లర్ల పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ అంశం రాజకీయంగా రచ్చకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది.