భువనగిరి (Bhuvanagiri) పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశ నిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సైతం సమన్వయంతో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు..
త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చిన సీఎం.. మే మొదటి వారంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ముఖ్య అతిధిగా హాజరు కానున్నారన్నారు. మరోవైపు పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏప్రిల్ 21 న నామినేషన్ దఖాలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు..
తనకు ఇంఛార్జి బాధ్యతలు పార్టీ అప్పగించిందని తెలిపిన ఆయన.. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించారు.. పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసినట్లు తెలిపారు.. అలాగే భువనగిరిలో బీఆర్ఎస్ (BRS) చాప్టర్ క్లోజ్ అయ్యిందని విమర్శించారు.. పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు 24 గంటలు పని చేయాలని సూచించారు.. ఎన్నికలు ముగిసే వరకు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు..
అలాగే ప్రతి నియోజక వర్గంలో ఈ నెల 18 వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడ బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. భువనగిరి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ ను భారీ ర్యాలీతో వేయబోతున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటుగా వెంకట్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు..