కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Cwc) సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Kharge), సోనియా గాంధీ(sonia gandhi), రాహుల్ గాంధీ(Rahul gandhi), ప్రియాంక గాంధీలు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ అగ్రనేతలకు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, థాక్రే, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్టుకు వారి వెంట భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీ. హనుమంత రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా వెళ్లారు. మరోవైపు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కర్ణాటక సీఎం సిద్ధారామయ్య హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హైదరాబాద్ లోని తాజ్ కృష్ణకు చేరుకున్నారు. వాళ్లకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
హైదరాబాద్ లో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను హోటల్ తాజ్‌కృష్ణలో ఈ రోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు హాజరు కావాలని 90 మంది నేతలకు ఆహ్వానాలు పంపినట్టు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అందులో 84 మంది సమావేశాలకు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ సమావేశాలకు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో, లోక్ సభ ఎన్నికలల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ఢిల్లీ నుంచి బయలు దేరే ముందు మీడియాకు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు.