ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా(Corona) మరోసారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా యాక్టివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో మృతుల(Deaths) సంఖ్య పెరుగుతోంది. 24గంటల్లో ఐదుగురు మహమ్మారితో పోరాడుతూ మృతిచెందారు. కరోనాతో కేరళ(Kerala)లో నలుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు విడిచారు. కొవిడ్-19 కారణంగా భారత్‌లో ఇప్పటి వరకు 5,33,317మంది మృతిచెందారు.
దేశంలో కరోనా మరణాల రేటు 1.19శాతం ఉంది. కోలుకుంటున్న వారి సంఖ్య 4.46కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81శాతంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు భారత్‌లో ఇప్పటి వరకు 220.67కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.
డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ మధ్య కొవిడ్ కేసుల సంఖ్య 56,043కి పెరగడంతో ఆ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 18వ తేదీన 79ఏళ్ల మహిళ నుంచి వచ్చిన నమూనా ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆమెకు ఇన్ఫ్లుఎంజా లక్షణాలు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఆమె కొవిడ్-19 నుంచి కోలుకున్నట్లు తెలిసింది.
అదేవిధంగా సింగపూర్‌లో ఉన్న ఒక భారతీయ యాత్రికుడు జేఎన్-1 (JN.1) సబ్-వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25వ తేదీన సింగపూర్‌కు వెళ్లాడు. అయితే తమిళనాడులో అలాంటి కేసులేవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.