కరోనా(Corona) మహమ్మారి దేశాన్ని మళ్లీ కలవరపెడుతోంది. కొవిడ్(Covid-19) కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరిగిపోతోంది. కేరళ(Kerala)లో జేఎన్ 1 వేరియంట్ (JN 1 Variant) బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 260 కొత్త కేసులు నమోదు కాగా ఐదుగురు మృతిచెందారు. కేరళలో నలుగురు, ఉత్తర ప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
సాధారణ రోగుల కోసం 30పడకలు, గర్భిణుల కోసం మరో 20 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కొత్త వేరియెంట్ కేసులు నమోదు కాలేదని రాజారావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.