ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా(Corona) మహమ్మారి నామరూపం లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళ(Kerala) రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. చలికాలం కావడంతో ఇన్ఫ్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవలి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100గా ఉన్నదని పేర్కొంది.
కరోనా మహమ్మారి దేశంలో కాలు మోపినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44కోట్లకు చేరింది. మృతుల సంఖ్య 5 లక్షల 33 వేల 306కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి 4కోట్ల 44లక్షల 68వేల 775 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా అలాగే జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ డాటా ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కరోనా టీకాలు వేశారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 50 లక్షల 02 వేల 889 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిసింది. ఇక WHO గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల 21 లక్షల 38 వేల 818 కరోనా కేసులు నమోదయ్యాయి. 69 లక్షల 85 వేల 964 మరణాలు సంభవించాయని WHO వెల్లడించింది.