Telugu News » Telangana : అరవింద్ అవినీతి మరకలు.. రేవంత్ సర్కార్ చర్యలకు సిద్ధమేనా?

Telangana : అరవింద్ అవినీతి మరకలు.. రేవంత్ సర్కార్ చర్యలకు సిద్ధమేనా?

ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వ్యవహారాలపై నోటీసులు ఇచ్చి ఎవరు చేయమన్నారో అభిప్రాయం తీసుకోవాలని.. అరవింద్ కుమార్ పని చేసిన డిపార్ట్ మెంట్లలో జరిగిన అక్రమాలపై కమిటీ వేసి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు తెలిపింది.

by admin

– కేటీఆర్ కు సన్నిహితుడిగా ముద్ర
– ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు
– ఓఆర్ఆర్ పై డిజిటల్ యాడ్స్ వ్యవహారంలోనూ దందా
– కేవలం మూడు కంపెనీలకే అంతా
– ప్రొసీడింగ్స్ లేకుండా ఎన్నో దందాలు
– మెమోలు ఇచ్చుకుంటూ పోతే వారానికి ఒక్కటి
– 5 లక్షలు ఇస్తే ఐ అండ్ పీఆర్ లో ఎంపానల్ ఎజెన్సీ
– ఇప్పటికీ హెచ్ఎండీఏలో తన మనుషులదే పైచేయి
– రేవంత్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందా?
– landsandrecords.com పరిశోధనాత్మక కథనం

కేసీఆర్ ప్రభుత్వంలో లెక్కలేనన్ని స్కాములు జరిగాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధానం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి. అధికారులను అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచేసిందని కాంగ్రెస్, బీజేపీ అప్పట్లో తెగ గగ్గోలు పెట్టాయి. ఇప్పుడు సర్కార్ మారింది. కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే.. ఆనాడు అవినీతి రాజ్యం అంటూ కేకలు పెట్టిన నేతలు.. ఇప్పుడు చర్యల దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. కాళేశ్వరం విషయంలోనూ కఠినంగా ముందుకు వేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో landsandrecords.com ఆసక్తికర కథనాన్ని ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చుట్టూ నడిచిన అవినీతి బాగోతాన్ని వివరించింది.

Corruption allegations against IAS Aravind Kumar

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర

కేసీఆర్ ప్రభుత్వంలో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హెచ్ఎండీఏ కమిషనర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సేవలందించారు. 1991 నుండి ఈ ఐఏఎస్ హోదాలో పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ వివిధ హోదాల్లో పని చేశారు. 2009-2014 మధ్య ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా మారారు. కేటీఆర్ కు సన్నిహితుడి ముద్ర పడిన ఈయన పేరు ఫార్ములా-ఈ వ్యవహారంలో ప్రస్తుతం మార్మోగుతోంది. నగదు విడుదల విషయంలో వివాదం చెలరేగగా కాంగ్రెస్ సర్కార్ మెమో కూడా జారీ చేసింది. ఇదొక్కటే కాదు ఈయన చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి.

డిజిటల్ యాడ్స్ వ్యవహారంలో చేతివాటం

టోల్ టెండర్ అంశంలో కీలకంగా వ్యవహరించిన అరవింద్ కుమార్ పై అప్పట్టో రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీళ్లిద్దరి పంచాయితీ నోటీసులు, కోర్టు వరకు వెళ్లింది. సరిగ్గా వేలం వేస్తే ఏటా 80 కోట్ల ఆదాయం వచ్చే డిజిటల్ యాడ్స్ విషయంలోనూ అక్రమంగా నామినేషన్ పద్దతిలో అన్నీ కానిచ్చేశారు. డబ్బులు తీసుకుని నామినేషన్ పద్దతిలోనే మీడియా రైట్స్ అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్సీ అన్నీ ప్రకాశ్ యాడ్స్ కు దోచిపెట్టారు. మొదటి దశగా కోకాపేట వద్ద పనులను అప్పగించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి శంషాబాద్, కోకాపేట, నార్సింగి, నానక్ రామ్ గూడ, తెల్లాపూర్ లాంటి మేజర్ సర్కిల్స్ వద్ద బ్యూటిఫికేషన్ పేరుతో మీనా బజారు, లీడ్ స్పేస్ కి గంపగుత్తగా ఇచ్చేశారు. కేవలం ఔటర్ పైనే 120 బోర్డులు పెట్టుకునేలా ప్లాన్ చేశారు. సర్కిల్స్ వద్ద 200 బోర్డ్స్, మెట్రో గ్రోత్ కారిడర్స్ లో 150, సైకిల్ ట్రాక్ , ఐ లాండ్స్ , టోల్ బూత్ల వద్ద ఆర్చ్ లు, ఎల్ ఈడీలు అన్ని కలిపి ఈ మూడు ఏజెన్సీలకే ఇచ్చేశారు. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందనే ధీమాతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.

మున్సిపాలిటీల్లో హోర్డింగ్స్ తీసివేయాలని ఆదేశాలు

శంషాబాద్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న మున్సిపాల్టీలకు ఓఆర్ఆర్ పై వెళ్లే వాహనదారులకు కనపడేలా హోర్డింగ్స్ కి అనుమతి ఇచ్చారు. ఒక్కొక్క హోర్డింగ్ 50 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటికీ మున్సిపాల్టీలు అనుమతులు ఇచ్చాయి. ఔటర్ పై, ఆయా సర్కిల్స్, టోల్ బూత్ ల వద్ద డిజిటల్, ఎల్ఈడీ యాడ్స్ పెత్తనం చెలాయించాలంటే.. సర్వీస్ రోడ్డులో ఉండే పెద్ద పెద్ద హోర్డింగ్స్ తీసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏడాది గడవక ముందే తీసివేయాలంటే ఎలా అంటూ కోర్టుకు వెళ్లారు నార్సింగి, మణికొండ, శంషాబాద్, తెల్లాపూర్ మున్సిపాల్టీలకు చెందిన హోర్డర్స్. అంతలోనే ఎన్నికలు రావడం కాంగ్రెస్ గెలవడంతో ఇప్పటికీ ఆ దిశగా లాభం చేకూరేలా అరవింద్ కుమార్ చర్యలు తీసుకోలేదు. అనధికార ఒప్పందం ప్రకారం వర్క్ చేసుకోండి అంటూ సెలవిచ్చారని తెలుస్తోంది. భారీగా డబ్బులు చేతులు మారడంతో లీడ్ స్పేస్, ప్రకాశ్ యాడ్స్, మీనా బజారు తమకు వర్క్ అవుట్ కావడం లేదని డబ్బులు ఇవ్వాల్సిందిగా అరవింద్ కుమార్ పై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అంతా తమ వాళ్లే ఉన్నారు.. పని పూర్తి అవుతుందని వారికి సర్దిచెబుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో గ్రోత్ కారిడార్ ప్రాంతాల్లో కేవలం ప్రకాశ్, లీడ్ స్పేస్, మీనా బజారుకు మాత్రమే అవకాశం ఉండేలా చేశారు. ఒక్క లీడ్ స్పేస్ కే గత ఏడాది 70 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చినా.. ఐ అండ్ పీఆర్ కి 10 కోట్ల విలువ చేసే ప్రచారం కూడా చేయలేదు. ఇదంతా అరవింద మహిమేనంటున్నారు. బ్రాండింగ్ పెట్టుకొని బ్యూటిఫికేషన్ అంటూ నామినేషన్ పద్దతిలో కోట్టేసిన తీరు ఉంది. విషయం బయటకు పొక్కకుండా ప్రొసీడింగ్స్ దాచి పెట్టేశారని తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో బీవోటీ పద్దతిలో వెళ్లాలని కొంతమంది సూచిస్తున్నారు.

ఐ అండ్ పీఆర్ లో ఎంపానల్ ఏజెన్సీ దందా?

ఐ అండ్ పీఆర్ లో యాడ్ ఇవ్వాలంటే ఎంపానల్ ఏజెన్సీ ద్వారా వెళ్లాల్సిందే. హోర్డింగ్స్ బిజినెస్ లో ఉండేవారు అర్హులుగా ఉంటారు. అయితే.. ఏడాది క్రితం ఎంపానల్ ఏజెన్సీలను పిలిచారు. 10 లక్షల రిఫండబుల్ డీడీ తీయాలి. అర్హులైన వారు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి ఎంపానల్ కావాలి. కానీ, ఎలాంటి డీడీలు తీయకుండానే 5 నుంచి 10 లక్షలు ఐ అండ్ పీఆర్ లోని అధికారులు తీసుకొని ఇచ్చేశారు. ఇదంతా కూడా అరవింద్ కుమార్ కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. 15 ఏజెన్సీలు కొత్తగా చేరాయి. రూల్స్ ని ఫాలో కాకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారికి పనులు చక్కబెట్టారు. అరవింద్ కుమార్ ఇప్పించిన తప్పుడు నిర్మాణాల అనుమతులు, కేటీఆర్ కి ఆయన శాఖకు ఆదాయ మార్గాలు చూపిస్తూ.. సంపాదించుకున్న తీరుపై విచారణ జరగాలని కథనాన్ని ఇచ్చింది landsandrecords.com. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వ్యవహారాలపై నోటీసులు ఇచ్చి ఎవరు చేయమన్నారో అభిప్రాయం తీసుకోవాలని.. అరవింద్ కుమార్ పని చేసిన డిపార్ట్ మెంట్లలో జరిగిన అక్రమాలపై కమిటీ వేసి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు తెలిపింది. ఈమధ్యే అరవింద్ కుమార్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

You may also like

Leave a Comment