జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లోని దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు చేసుకునేందుకు హిందూ పక్షానికి వారణాసి కోర్టు (Varanasi court) అనుమతి ఇచ్చింది. హిందువుల పక్షాన పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
పూజా కార్యక్రమాలు చేసేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాశీ విశ్వనాథ ఆలయం నామినెట్ చేసిన పూజారితో పూజలు చేయించాలని సూచించింది. జ్ఞానవాపి వ్యాసాజీ బేస్మెంట్లో పూజలు చేసేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు వారణాసి కోర్టులో విచారణ జరిగింది.
పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను కోర్టు విన్నది. అనంతరం బేస్మెంట్లో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లో పూజ ప్రారంభం అవుతుందని ఈ పిటిషన్ పై హిందువుల తరఫున వాదించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు. పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఈ సందర్బంగా ఆయన వివరించారు.
మరోవైపు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. యూపీలో వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం చాలా కాలంగా పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలోని దేవతా మూర్తులను దర్శించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కొందరు మహిళలు కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతులతో ఏఎస్ఐ సర్వే నిర్వహించింది.