భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు(Covid Cases) శుక్రవారం 3వేల మార్క్‌ను దాటాయి. అయితే కొత్త సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల గుబులు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో ఒకరు మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరణాల రేటు 1.18శాతంగా నమోదైంది. 10రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి.
ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. కొవిడ్-19 నుంచి ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజాగా గురువారం, భారత్‌లో 594 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 2,311 నుండి 2,669కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరుగురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, మృతిచెందారని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.