న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్లో కరోనా (Carona) వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway)కు కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం కాన్వే ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో డెవాన్ కాన్వేతో క్లోస్ గా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ బోర్డు హెచ్చరించింది.
మరోవైపు కరోనా పాజిటివ్ రావడంతో నేడు పాకిస్థాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో చాడ్ ను కివీస్ బోర్డు ఎంపిక చేసింది. నిన్న పాజిటివ్‌గా తేలడంతో కాన్వే, క్రైస్ట్‌చర్చ్ హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాంటర్బరీ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చాడ్ బోవ్స్ (Chad Boves) ఈ రోజు జట్టులో చేరనున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడమ్ కూడా కరోనా బారిన పడ్డాడని, అతడి స్థానంలో బ్రెండన్ డంకెర్స్ జట్టుతో కలుస్తాడని పేర్కొంది.
పాకిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచుల్లో గెలిచిన కివీస్.. 3-0తో ట్రోఫీ సొంతం చేసుకుంది. కివీస్ జోరు చూస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసేలా ఉందని భావిస్తున్నారు. శుక్రవారం క్రిస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇదే వేదికపై 21న ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. కనీసం ఈ రెండు మ్యాచ్‌లలో అయినా పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది బోణీ కొడతారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు..