రాజేంద్ర నగర్(Rajendra Nagar) అగ్రికల్చర్ యూనివర్సిటీ(Agriculture University) ఘటనపై సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ(ABVP) కార్యకర్తను జుట్టుపట్టి లాగిన కానిస్టేబుల్ ఫాతిమా(Constable Fatima)ను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100ఎకరాల భూములులను హైకోర్టుకు కేటాయించవద్దని, జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు శాంతియుతంగా నిరసన చేపట్టాయి. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఏబీవీపీ కార్యకర్తను కానిస్టేబుల్ ఫాతిమా బైక్‌పై నుంచి జుట్టుపట్టి లాగడంతో కిందపడిపోయింది.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. ‘ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారు. మరి రక్షకులే భక్షకులుగా మారి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ప్రజల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు.. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు.. విద్యార్థినిని జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన నెటిజన్స్ కానిస్టేబుల్ తీరుపై మండిపడ్డారు. కానిస్టేబుల్ విచక్షణారహిత వైఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఈ ఘటనను ఖండించారు. మరోవైపు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ సీఎస్‌తోపాటు డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.