బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)లపై సీపీఐ నారాయణ (Narayana) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మండిపడ్డారు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ నుంచి ఎమ్మెల్సీ కవితను తప్పించారో అప్పుడే బీజేపీ-బీజేపీ ఒక్కటేనన్న విషయం బయటపడిందన్నారు. గోబెల్స్ బతికి ఉంటే కేసీఆర్, మోడీ మాటలు విని చనిపోయే వారని ఎద్దేవా చేశారు.
దళితున్ని సీఎం చేస్తానని గతంలో హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడన్నారు. ఇప్పుడు బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెబుతోందన్నారు. బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ మరి ఆ పార్టీ అధ్యక్షున్ని తొలగించిందన్నారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చేలాగా బీఆర్ఎస్, బీజేపీ మెనిఫెస్టోలు లేవని వెల్లడించారు. కేవలం అరచేతిలో వైకుంఠం చూపించేలా ఆ పార్టీల మెనిఫెస్టోలు ఉన్నాయన్నారు.
యువతను బీజేపీ దగా చేస్తోందన్నారు. ఇన్ని ఏండ్లలో కేసీఆర్ సర్కార్ కనీసం పోటీ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాకకపోతే గోషామహల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉన్న పార్టీలో టికెట్ దొరకపోవడంతో ఓ దౌర్భాగ్యుడు బీఫామ్ కొనుక్కని కొత్తగూడెంలో ఫార్వర్డ్ పార్టీ నుంచి పోటీలో ఉన్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీ ఫామ్ కొనుక్కుని పోటీ చేసి ప్రజలకు ఆ వ్యక్తి ఏం సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు. జలగం వెంగళరావు వారసుడు వెంకట్ రావుకి బీ ఫామ్ కొనుక్కునే దుస్థితి పట్టిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పారు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, ఒకే దెబ్బకు మూడు పిట్టలను కతం అవుతాయన్నారు.