తెలంగాణలో అధికార బీఆర్ఎస్పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించలేదని మండిపడ్డారు. ఈరోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరి, రాజకీయ ఎత్తుగడలు, తదితర అంశాలపై చర్చించారు.
తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కూడా హాజరయ్యారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ ఓ విష కూటమి అని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుందని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశలు అడియాశలయ్యాయయని విమర్శించారు.
సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కలిసివచ్చే లౌకిక పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. నిర్ధిష్ట ప్రతిపాదనలు వస్తే పొత్తులపై చర్చిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే తొందర అవసరం రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదలకు నిరసనగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ విప్లవ వార్షికోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. బీజేపీ గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17ను హిందూ, ముస్లిం ఘర్షణలుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.