CR Rao ; ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, మహా మేధావి సీఆర్ రావు (CR Rao) కన్ను మూశారు. స్టాటిస్టిక్స్ రంగంలో అనేక సిధ్ధాంతాల రూపకర్త అయిన ఆయన వయస్సు 102 ఏళ్ళు.. తెలుగు కుటుంబానికి చెందిన ఆయన కర్ణాటకలో జన్మించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన ఆయన స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా పేర్కొనబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ పురస్కారాన్ని పొందారు. ఆధునిక గణిత శాస్త్రంలో అత్యంత ప్రతిభావంతుడైన ఆయనకు ఈ ఏడాదే ఈ అవార్డును ప్రదానం చేశారు. కర్ణాటకలోని హడగలిలో తెలుగు కుటుంబానికి జన్మించిన ఆయన ఏపీ లోని గూడూరు,నూజివీడు, నందిగామ, విశాఖలో స్కూల్ విద్యాభ్యాసం కొనసాగించారు.
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్ లో పట్టా పుచ్చుకున్నారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన సీఆర్ రావు గణిత శాస్త్రంలో పీ హెచ్ డీ కోసం బ్రిటన్ వెళ్లి సర్ రోనాల్డ్ ఏ వద్ద పీ హెచ్ డీ చేశారు. 1965 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో డీ ఎస్సీ డిగ్రీ చేశారు. మొదట ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్ టిట్యూట్, కేంబ్రిడ్జ్ ఆంథ్రోపాలొజికల్ మ్యూజియంలో పని చేశారు.
భారత్ కు వచ్చిన ఆయన ఆ తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ను ప్రారంభించారు. 1968 లో సీఆర్ రావును పద్మభూషణ్, 2001 లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 2002 లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుంచి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు. ఆయన పూర్తి పేరు కాల్యంపూడి రాధాకృష్ణ రావు.
పెన్సిల్వేనియన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసిన ఆయన బఫెలో లోని యూనివర్సిటీ రీసర్చ్ ప్రొఫెసర్ గా కూడా వ్యవహరించారు. హైదరాబాద్ యూనివర్సిటీ ఆవరణలో ఆయన పేరిట సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ని ఏర్పాటు చేశారు. 19 దేశాల నుంచి ఆయన 39 డాక్టరేట్లను పొందారు. 477 రీసర్చ్ పత్రాలను ప్రెజెంట్ చేసి.. 15 పుస్తకాలు రాశారు.