మేకప్ చేయించుకోవడాని బ్యూటీ పార్లర్ (Beauty Parlour)కు వచ్చిన ముగ్గురు మహిళలు బ్యూటీషియన్ పై యాసిడ్ (Acid) పోసి డబ్బు, నగలుతో పరారయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole)లో జరిగిన ఈ దొంగతనం వివరాలను ఒంగోలు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…
ఒంగోలు నగరంలోని శ్రీకృష్ణ నగర్లో రజియా అనే మహిళ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆ బ్యూటీ పార్లర్ కు ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వచ్చి తమకు మేకప్ చేయాలని అడిగారు. సరేనని రజియా వారికి అవసరమైన సరంజామాను సిద్ధం చేస్తున్నారు. ఈ లోగా ఈ ముగ్గురు మహిళలు బ్యూటీ పార్లర్ లో కలియ తిరిగి…రజియాను కుశల ప్రశ్నలు అడుగుతూ కొద్ది సేపు గడిపారు.
కాసేపటి తర్వాత ముగ్గురు మహిళల్లో ఒకరు ఫేషియల్ చేయించుకున్నారు. మరో మహిళ ఐ బ్రోస్ చేయించుకున్నారు. మూడో మహిళ అర్జంటుగా వాష్ రూంకు వెళ్లాలని చెప్పి…పార్లర్ లో ఉన్న వాష్ రూంనే ఉపయోగించారు.
కొద్దిసేపటి తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళ బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న యాషిడ్ తో బ్యూటీషియన్ రజియాపై దాడి చేసింది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా, ఆ యాసిడ్ ఆమె భుజం, ముక్కుపై పడింది. మిగిలిన ఇద్దరు మహిళలు రజియా మొహంపై క్లోరోఫాం చల్లిన కర్ఛీఫ్ ను పెట్టి…సృహా కోల్పోయేలా చేశారు.
కొద్ది సేపటి తర్వాత రజియా పరిస్థితిని గమనించిన సమీప దుకాణదారులు ఆమెను సమీపంలోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం రజియా సృహలోకి వచ్చారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రజియాతో సహా సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రజియా వంటిపై నగలతో పాటు పార్లర్ లో ఉన్న నగదు, నగలు కూడా పోయినట్లు గుర్తించారు. నిందితుల్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా ముగ్గురు నిందితురాళ్లు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ముగ్గురు మహిళల ఆచూకీ కోసం స్పెషల్ పోలీసు బృందాలను రంగంలోకి దించారు. చోరీ చేసిన బంగారు ఆభరణాల విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితురాలు చెబుతున్నారు.