కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala) దర్శనానికి చాలా సమయం పడుతోందని తెలుస్తోంది. వారాంతం కావడంతో పాటు ఉగాది పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులకు తిరుమలకు పోటెత్తారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
అయితే, శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు(TTD OFFICERS) వెల్లడించారు.మరో వారం రోజులు గడిస్తే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం రూ.300 స్పెషల్ దర్శనానికే సుమారు 3 గంటల సమయం పడుతోందని సమాచారం. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.
గురువారం తిరుమల వెంకటేశ్వరుడిని 62,459 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 26,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకునర్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం తిరుపతిలో వేసవి కాలం సందర్భంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీలో మాత్రం ఎటువంటి మార్పు లేదని సమాచారం.