దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fraud) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్క్యామర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా పర్ట్ టైం జాబ్(Part Time job) పేరుతో ఓ టెకీ వద్ద రూ.61లక్షలు దోచేశారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూర్‌కు చెందిన 41 ఏళ్ల టెకీ ఉదయ్ ఉల్లాస్ సోషల్ మీడియా ద్వారా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చెక్ చేస్తుండగా సుహాసిని అనే మహిళ పార్ట్‌టైం జాబ్ ఆఫర్‌ను ప్రతిపాదించింది. స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఆర్జించవచ్చని ఉల్లాస్‌కు ఆమె నమ్మబలికింది.
ముందుగా సింపుల్ టాస్క్‌ల్లో కొద్ది మొత్తం రిటన్స్ పొందడంతో అందులో ఎలాంటి మోసం లేదని నమ్మిన ఉల్లాస్ ఆపై రూ.20లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కాకపోవడంతో విత్‌డ్రా ఫీచర్ అన్‌లాక్ కావాలంటే మరో రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయాలని స్క్యామర్ ఒత్తిడి చేశాడు.
ఫ్రెండ్స్, బంధువుల నుంచి అప్పుచేసి రూ.61లక్షలు ఇన్వెస్ట్ చేసినా వాటిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేకపోవడం, స్కామర్ మొహం చాటేశారు. చివరికి అదంతా మోసమని గ్రహించిన ఉదయ్ ఉల్లాస్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌లోనూ అనేక సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు.