బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు తెలుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడింది. ఇది వాయుగుండంగా మారి శనివారం నాటికి తుపాను(Cyclone) గా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తీరం వెంబడి డేంజర్ బెల్స్(Danger bells) మోగుతున్నాయి.
ఇప్పటికే ఏపీలోని నెల్లూరు, తమిళనాడులోని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని IMD సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుఫానుగా అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ తుపాను ప్రభావంతో శనివారం నుంచి రాయలసీమ, కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదముందని, కోతకు వచ్చిన వరి పంటను వెంటనే కోసి భద్రపరుచుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
అయితే, తుపాను బీభత్సం ఇంతటితో ఆగేలా లేదు. ఏపీకి మరో భారీ తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ రెండో తేదీ నాటికి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఏపీ తీరం వైపు తుఫాను దిశ, గమనం ఉంటే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.