ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపాన్(Cyclone)గా మారనుండడంతో మాయన్మార్ దేశం సూచించిన ‘మిచౌంగ్’(Miachaung)గా నామకరణంగా చేశారు. డిసెంబర్ మూడో తేదీ నాటికి నైరుతి బంగాళా ఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇది వాయువ్య దిశగా తుపాను కదులుతుందని, ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిచౌంగ్ తుపాను నాలుగో తేదీన నాటికి చెన్నై– మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫానుగా మారాక దిశ, గమనంపై అంచనా వేస్తోంది. అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండం ఆ తర్వాత తుఫానుగా మారనున్న సిస్టంను ట్రాక్ చేస్తుంది. అయితే.. వాతావరణ శాఖ ట్రాక్ ప్రకారం.. నాలుగో తేదీ నాటికి చెన్నై నెల్లూరు సమీపానికి తుఫాను వచ్చాక.. ఐదో తేదీ నాటికి గుంటూరు తీరానికి అతి సమీపంలోకి వస్తుంది. ఏపీ పైనే ఎక్కువ ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఈ క్రమంలో మిచౌంగ్ ప్రభావంతో కోస్తా రాయలసీమలో భారీగా ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. ఐదో తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే భారీ ఈదురు గాలులు వీస్తే పంటలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.