భారత వాతావరణ కేంద్రం (IMD) ‘మిచౌంగ్’ తుఫాన్ (Cyclone Michaung) హెచ్చరికలు చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 630 కిలో మీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 740 కిమీ, బాపట్లకు ఆగ్నేయంగా 810 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 800 కి.మీల దూరంలో ఉన్నట్టు బులిటెన్ విడుదల చేసింది.
తుఫాన్ వాయవ్య దిశలో ప్రయాణించి డిసెంబర్ 4 నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని వెల్లడించింది. తుఫాన్ ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా వెళ్తున్నట్టు అంచనా వేసింది. డిసెంబర్ 5 మధ్యాహ్ననికి ముందు నెల్లూరు, మచిలిపట్నం మధ్య తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుఫాన్ సమయంలో గరిష్టంగా 80 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు.
ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామన్నారు. అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా 12 జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆయన సూచించారు. ముందస్తు చర్యలను చేపట్టామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.