కాంగ్రెస్ (Congress) లో రేవంత్ (Revanth) ను వ్యతిరేకించి బయటకొచ్చిన లీడర్లలో దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఒకరు. ప్రస్తుతం ఈయన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వంపై రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలను తనదైన రీతిలో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా నేతల చేరికల సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన రేవంత్ మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు.
రాజకీయ నైతికతని తుంగలో తొక్కి, అసహ్యకరమైన, అవమానకరమైన రీతిలో దుర్భాషలాడుతూ క్రిమినల్ బెదిరింపులకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి మానసిక రోగిగా మారిపోయాడని అన్నారు శ్రవణ్. ఆయన తన సహచర రాజకీయ నాయకులపైనే కాకుండా అన్ని పరిమితులని దాటి చట్టాన్ని అమలు చేసే పోలీసులపై కూడా దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో బట్టలు విప్పి దాడి చేస్తానని బహిరంగంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అసాంఘిక నేరపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారన్న శ్రవణ్.. ఇది 125 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శక సూత్రాలను ప్రతిబింబించదని అన్నారు. ఇలాంటి అసాంఘిక నేరపూరిత చర్యలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు. పోలీసు బలగాలను ఉద్దేశించి నేరపూరిత క్రిమినల్ బెదిరింపులకు పాల్పడిన రేవంత్ రెడ్డిని సుమోటో పద్ధతి ద్వారా తక్షణమే చట్టం పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డీజీపీ, మహబూబ్ నగర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ దీనిపై విజ్ఞప్తి చేశారు దాసోజు శ్రవణ్.