Telugu News » 2 వేలు దాటిన మొరాకో భూకంప మృతుల సంఖ్య…!

2 వేలు దాటిన మొరాకో భూకంప మృతుల సంఖ్య…!

by Ramu
Death toll crosses 2000 in morroco earth quake

ఉత్తరాఫ్రికా దేశం మొరాకోపై ప్రకృతి కన్నెర్ర జేసింది. మొరాకోలో శుక్రవారం భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటిందని అధికారులు వెల్లడించారు. సుమారు 1500 పైగా మంది తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. మరాకేశ్ కు నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కలిపి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులైనట్టు ఐరాస వెల్లడించింది.

Death toll crosses 2000 in morroco earth quake

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. మరాకేశ్ కు 70 కిలో మీటర్ల దూరంలో అట్లాస్‌ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టు మొరాకో నేషనల్ సిసామిక్ మానిటరింగ్ అలర్ట్ నెట్ వర్క్ తెలిపింది. భారీ భూకంపానికి నగరంలో పలు చోట్ల ఇళ్లు నేల మట్టం అయ్యాయి. దీంతో శిథిలాల కింద భారీ సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. శిథిలాలన్నీ రోడ్లపై పడటంతో వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచి పోయాయి. దీంతో బాధితుల వద్దకు చేరుకోవడం ఇబ్బందిగా మారిందని రెస్య్యూ బృందాలు చెబుతున్నాయి. నగరంలో పలు చోట్ల ఇప్పుడిప్పుడే బాధితుల దగ్గరకు చేరుకుంటున్నామని వెల్లడించాయి.

మారుమూల పర్వత ప్రాంతాలకు చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు మొదలు పెట్టేందుకు ప్రత్యేక బృందాలు బయలు దేరాయి. అక్కడ మృతులను కలిపితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక భూకంప నేపథ్యంలో మొరాకోలోని ఇతర దేశాల ప్రజలు తమ దేశాలకు బయలు దేరారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారతీయులు చిక్కుకున్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. కమ్యూనిటీ మెంబర్స్ తో తాము టచ్ లో వున్నామని వెల్లడించారు. స్థానిక అధికారులు చేసే సూచనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని మొరాకోలోని భారతీయులకు ఎంబసీ అధికారులు సూచించారు.

మరోవైపు మొరాకోకు సహాయం అందించేందుకు అల్జీరియా ముందుకు వచ్చింది. మొరాకో, అల్జీరియా మధ్య రెండు దశాబ్దం క్రితం సంబంధాలు తెగిపోయాయి. కానీ మానవత దృక్పథంతో మొరాకోకు సహాయం చేసేందుకు అల్జీరియా రెడీ అయింది. మొరాకోలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తమ దేశ సైన్యాన్ని పంపుతున్నట్టు అల్జీరియా ప్రకటించింది.

మొరాకో భూకంపంలో పలు చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. పన్నెండవ శతాబ్దానికి చెందిన కౌటౌబియా మసీదు పూర్తిగా దెబ్బతింది. మరకేష్‌ ఓల్డ్ సిటీలో యునెస్కో గుర్తింపు పొందిన రెడ్‌ వాల్స్‌ కూడా దెబ్బతిన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో అత్యంతం అరుదుగా భూకంపాలు సంభవిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ పర్వత ప్రాంతంలో నమోదైన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైందని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment